భావం లేకుండా లయప్రధానమైన అంగభంగిమలను నృత్తంగా, భావాన్ని అభినయం ద్వారా ప్రదర్శిస్తూ, ఆ భావంలో రమించి చేసే నాట్యాన్ని నృత్యంగా చెప్పింది నాట్యశాస్త్రం. అటువంటి నృత్య సాంప్రదాయాలు భారతదేశంలో అనేకం. వాటిలో అత్యంత రమణీయమైనదిగా ఒడిస్సీ నృత్యాన్ని చెప్పుకోవచ్చు. దేహంలో ఆపాదమస్తకం సమస్తాన్ని అద్భుతమైన జ్యామితిలో అందమైన భంగిమల్లో ఆవిష్కరించేది ఒడిస్సీ నృత్యం. ఈ నాట్య సాంప్రదాయంలో వస్త్రధారణ, ఆభరణాలు, ఇతర అలంకరణలు కన్నుల పండువగా ఉంటాయి. వైష్ణవ సాంప్రదాయంలో దేవాలయాలో వేల ఏళ్ల క్రితం ఈ నృత్యశైలి ఆవిర్భవించినట్లు భరతముని నాట్యశాస్త్రంలో ప్రస్తావనలు ఉన్నాయి. తరువాతి కాలంలో శైవ శాక్తేయ దేవాలయ కార్యక్రమాలలో కూడా ఈ నృత్యశైలి అంతర్భాగమైంది. పురీ జగనాథుని మందిరం, కోణార్క సూర్య దేవాలయం, లింగరాజ దేవాలయం వంటి అద్భుత శిల్ప కళా సంపదలున్న క్షేత్రాలలో ఒడిస్సీ నృత్యం అలరారింది.
ఒడిస్సీ నృత్య ప్రదర్శనలో ముఖ్యమైన అంశాలు:
1. మంగళాచరణం - పరమాత్మను స్మరిస్తూ చేసే మొట్ట మొదటి అంశం. ఇది ఎక్కువ శాతం శ్లోక రూపంలో ఉండే పురీ జగన్నాథుని స్తుతి. ఈ స్తుతిలోనే త్రిఖండి ప్రణామం (దేవతలు, గురువులు, సభకు నమస్కారములు చేసే పద్ధతి) ఉంటుంది.
2. పుష్పాంజలి - పరమాత్మకు అభినయపూర్వకంగా పూలను సమర్పించే అంశం
3. భూమి ప్రణామం - నర్తించే ముందు భూదేవిని క్షమాపణ కోరుతూ స్తుతి చేయటం.
4. బటు లేదా బట్టు లేదా స్థాయీ నృత్యాంశం - ఇది వేగంగా సాగే నృత్యం. సాధారణంగా పరమశివుని నుతించేది. ఇందులో సాహిత్యం ఉండదు, లయప్రధానమైనది.
5. తరువాత నృత్యము - ఇది కావ్యాంశముల ప్రదర్శనతో అభినయ ప్రధానమైనది. ఇందులో ముద్రలు, భావము, కళ్లు, అంగముల కదలికకు ప్రాధాన్యత ఉంటుంది. ఇవి సంస్కృతము లేదా ఒడియా భాషలో ఉంటాయి. జయదేవుని అష్టపదులు, దశావతార వర్ణన, అర్ధనారీశ్వర స్తోత్రము, రాధాకృష్ణుల ప్రణయ హేల మొదలైనవి. జయదేవుని అష్టపదులు ఒడిస్సీ నృత్యంలోని ప్రధానాంశంగా ఉంటాయి.
6. నాట్యము లేదా నృత్య నాటకము - పురాణేతిహాసములను అభినయం ద్వారా తెలిపే అంశం.
7. మోక్ష - ఒడిస్సీ నృత్యానికి ప్రత్యేకమైనది ఈ అంశం. ఇది ప్రదర్శనలో ఆఖరి అంశం. ఇది సాధారణంగా సనాతన ధర్మంలోని మోక్ష తత్త్వాన్ని తెలియజేసేది. పరిపూర్ణమైన తాదాత్మ్యతతో ఈ అంశం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి పరమాత్మతో అనుసంధానం చేస్తుంది.
ఒడిస్సీ నృత్య సాంప్రదాయంలోని అభినయంలో ప్రధానమైనవి భంగములు. ఇవి ఎనిమిది శరీర భంగిమలతో, కదలికలతో కూడినవి. వీటిని బేలి అంటారు. కదలికలలో పైకి లేవటాన్ని ఉఠా, కూర్చోవటాన్ని బైఠా, నిలబడటాన్ని స్థాంక అంటారు. రంగభూమిపై గమనాన్ని చాలి అంటారు. ఈ బేలిలను భావంతో అనుసంధానం చేస్తారు. ఆ గమనంలో నిర్ణీతమైన జ్యామితిని కళాకారులు అనుసరిస్తారు. ఒడిస్సీ నృత్యశైలిలో ఆరు రకాల పదభేదాలుంటాయి. పైన చెప్పుకున్న భంగములలో ప్రధానమైనవి మూడు:
1. సమభంగ - చతురస్రాకార స్థితి, శరీర బరువును రెండు కాళ్లపై సమానంగా వేసి, వెన్నును నిటారుగా ఉంచి, మోచేతులను వంచుతూ చేతులను పైకి ఎత్తటం 2. అభంగ - కాళ్లను వంచటం ద్వారా శరీర బరువు ఒక పక్క నుండి మరొక పక్కకు మరలుతూ, పాదములు, మోకాళ్లు విప్పారజేస్తూ, నడుమును ఒక పక్కకు తిప్పటం 3. త్రిభంగ - ఎస్ ఆకారంలో శరీరాన్ని మూడు రకాలుగా వంచుతూ, తల, తుంటె మొండానికి వ్యతిరేక దిశగా తిప్పటం. చేతులు, కాళ్లు దేహాన్ని ఒక దీర్ఘ చతురస్రాకరంగా మలచుతాయి.
ఇతర భారతీయ నృత్యశైలులవలెనే ఒడిస్సీలో కూడ ముద్రలు అభినయంలో భావావిష్కరణకు ప్రధానమైనవి. ఒడిస్సీలో మొత్తం 63 ముద్రలున్నాయి. అభినయ చంద్రికలో చెప్పబడిన ముద్రలకు దాదాపుగా సారూప్యత ఉన్నవి ఈ ముద్రలు.
ఇక వస్త్రధారణకు వస్తే - ఒడిస్సీ నృత్యంలో అందమైన దుస్తులు, ఆభరణాలు ఉపయోగిస్తారు. ఒడియా పట్టును చాలా విరివిగా ఉపయోగిస్తారు. చక్కని కుచ్చిళ్లతో అందమైన రంగులలో ఈ వస్త్రాలు నేయబడతాయి. ఇవి దాదాపుగా సంభల్‌పురీ మరియు బొంకై చీరలలో ఉంటాయి. ఆభరణాలలో వెండి మరియు ఇతర లోహాలతో చేయబడినవి అందంగా ఉంటాయి. ఒడిస్సీ నృత్యానికి ఉన్న ప్రత్యేకత కొప్పు. దీనిని సీన్‌తి అంటారు. ఈ కొప్పుపై అర్ధచంద్రాకారంలో మల్లెపూలను అలంకరించబడినది లేదా వెదురు కిరీటంపై నెమలిపించాలు అలంకరించబడిన రీతి ప్రధానమైనవి. ఇక కళాకారుల నుదుట తిలకము దిద్ది, అల్లకము ధరిస్తారు. కళ్లకు కాటుక, చెవులకు, మెడలో అందమైన ఆభరణాలు ధరిస్తారు. భుజకీర్తులు ఒడిస్సీ నృత్యంలోని అలంకరణలో ప్రధానమైనవి. వీటిని బాహిచుడీ అంటారు. చేతులకు కంకణాలు కూడా ధరిస్తారు. నడుముపై అనేక వరుసలుండే గొలుసులను ధరిస్తారు.
ఒడిస్సీ నృత్యం ప్రధానంగా మూడు రకాల వ్యవస్థలలో అభివృద్ధి చెందింది 1. మహరి - దేవాలయ దేవదాసీ వ్యవస్థకు చెందినది 2. గొటిపువా - పురుషులు స్త్రీ వేషధారణ చేసి మహరిల వద్ద విద్య నేర్చుకునే వారు. ఈ తరహా విద్యలో రణవిద్యలు, క్రీడాంశాలు, అనేక రకాల అంగవిన్యాసాలుంటాయి. వీరు దేవాలయ వ్యవస్థ బయట జనరంజకంగా జాతరలలో నృత్యం చేసేవారు 3. నర్తకి - రాజాస్థానాలలో జరిగే నృత్య ప్రదర్శనలు. శృంగార ప్రధానమైనది ఈ వ్యవస్థ.
ఒడిస్సీ నృత్యంలో పేరొందిన కళాకారులు - గురువులు కేలూచరణ మహాపాత్ర, సోనాల్ మాన్‌సింగ్, సుజాత మహాపాత్ర, గంగాధార్ ప్రధాన్, కుంకుం మహంతీ, సన్యుక్తా పాణిగ్రాహి, షరాన్ లోవెన్, డోనా గంగులీ, ఈషా డియోల్ మొదలైనవారెందరో ఉన్నారు.
ఒడిస్సీ నృత్యం అన్నివిధాలా సంపూర్ణమైన నాట్యకళ. భక్తి, భావం, ఆహార్యం, అభినయం, పదవిన్యాసం అన్నిటా అధుతమైన అత్యున్నత ప్రమాణాలు కలిగి ఎంతో కఠినమైన సాధన చేస్తే తప్ప ఈ నాట్యశైలిలో నైపుణ్యం రాదు. కృష్ణ తత్త్వావిష్కరణకు ఈ నృత్యశైలి అద్భుతమైన సాధనం.
